గురువారం 24 జూన్ 2021
Cinema - Mar 10, 2021 , 00:16:35

నా శైలికి భిన్నమైన సినిమా ఇది!

నా శైలికి భిన్నమైన సినిమా ఇది!

‘నా కెరీర్‌లో సరికొత్త అనుభూతిని మిగిల్చిన చిత్రమిది. నిర్మాణపరమైన ఒత్తిడులు ఎలా ఉంటాయో ఈ సినిమాతో అవగతమైంది. భవిష్యత్తులో  ఇలాంటి వినూత్న ప్రయత్నాలకు తప్పకుండా అండగా నిలుస్తా’ అని అన్నారు దర్శకుడు అనిల్‌రావిపూడి. ఆయన దర్శకత్వ పర్యవేక్షణ చేసిన తాజా చిత్రం ‘గాలి సంపత్‌'. శ్రీవిష్ణు, రాజేంద్రప్రసాద్‌ ప్రధాన పాత్రల్ని పోషించారు.  ఈ నెల 11న  విడుదలకానుంది.  ఈ సందర్భంగా అనిల్‌ రావిపూడి పాత్రికేయులతో పంచుకున్న ముచ్చట్లివి..

‘గాలిసంపత్‌'తో భాగమవ్వడానికి ప్రేరణనిచ్చిన అంశాలేమిటి?

ఈ చిత్ర నిర్మాత ఎస్‌.కృష్ణ నాకు మంచి స్నేహితుడు. ‘పటాస్‌' నుంచి రచయితగా నాతో కలిసి  ప్రయాణం చేస్తున్నాడు. నిర్మాతగా మారాలనే ఆలోచనతోనే అతడు ఈ కథ రాసుకున్నాడు. తొలుత    గాలిసంపత్‌ పేరు గురించి కృష్ణ చెప్పగానే అవారాగా తిరిగే వ్యక్తి  కథ అనుకున్నా. కానీ ప్రమాదం వలన నోటి నుంచి మాట కాకుండా కేవలం గాలి మాత్రమే వచ్చే ఓ తండ్రి స్ఫూర్తిదాయక ప్రయాణమని చెప్పగానే నాలో ఆసక్తి కలిగింది.   

ఈ సినిమాతో తొలిసారి నిర్మాణ బాధ్యతల్ని స్వీకరించారు? ఆ అనుభవం ఎలా ఉంది?

దర్శకుడిగా ఉన్న నేను ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించడంతో పాటు స్క్రీన్‌ప్లేను అందించాను. రాజేంద్రప్రసాద్‌ సమస్యల్లో ఇరుక్కునే ఎపిసోడ్స్‌కు సంబంధించి ముఖ్యమైన ఇన్‌పుట్స్‌ ఇచ్చా. నిర్మాత తాలూకు ఒత్తిడులు ఎలా ఉంటాయో ఈ   సినిమాతో తెలుసుకున్నా. అయితే మంచి సినిమా చేశాననే సంతృప్తి ఉంది. 

మీ శైలిలో సాగే వినోదాత్మక కథాంశమిదని అనుకోవచ్చా?

నా పేరును చూసి కంప్లీట్‌ ఎంటర్‌టైనర్‌ అనే భావనతో వచ్చే ప్రేక్షకులు నిరాశ చెందకూడదనే  ప్రచార వేడుకల్లో కథ మొత్తం చెప్పేశా. అనుకోకుండా పాడుబడిన బావిలో పడ్డ మాటలు రాని వ్యక్తి ఎలా బయటపడ్డాడనే కథాంశాన్ని చూడటానికి సిద్ధమై వస్తేనే సినిమాలోని థ్రిల్‌ను ఎంజాయ్‌ చేస్తారు. ద్వితీయార్థం ఆద్యంతం భావోద్వేగభరితంగా ఉంటుంది.   

చిన్న కథల్ని ప్రోత్సహించాలనే ఆలోచన ఎప్పుడు మొదలైంది?

కెరీర్‌ తొలినాళ్ల నుంచి ఆ ఆలోచన ఉండేది. కానీ ఇన్నాళ్లు నేను దర్శకుడిగా నిలదొక్కుకోవడంపైనే దృష్టిపెట్టా. భవిష్యత్తులో కొత్త కథలతో సినిమాలు చేయాలనుకునేవారికి అండగా నిలబడాలని అనుకున్నా. జోనర్‌ ఏదైనా నాకు నచ్చిన సినిమాను ప్రోత్సహిస్తా. మంచి సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి ఈ టీమ్‌ వెన్నంటి నిలిచా. భిన్న ధృవాల్లాంటి తండ్రీకొడుకులుగా రాజేంద్రప్రసాద్‌, శ్రీవిష్ణు ఈ సినిమాలో కనిపిస్తారు.

దర్శకుడిగా వినోదాత్మక పంథాకు భిన్నమైన కథల్ని ఎంచుకుని సినిమాలు చేస్తారా?

 నా దృష్టిలో ప్రయోగాలు, కమర్షియల్‌ ఏదైనా సినిమానే. వేర్వేరుగా చూడలేను. గతంలో మహిళా ప్రధాన కథాంశంతో స్పోర్ట్స్‌ డ్రామా చేయాలనుకున్నా. సాయిపల్లవికి కథ వినిపించా. కానీ అనివార్య కారణాల వల్ల అది వర్కవుట్‌ కాలేదు. 

‘ఎఫ్‌-3’పై  భారీ అంచనాలున్నాయి? వాటిని నిలబెట్టుకోవడం  అనిపిస్తుందా?

‘ఎఫ్‌-2’కు మించి మూడింతల నవ్వులను పంచుతుంది. 22 రోజులు చిత్రీకరణ జరిపాం. ‘ఎఫ్‌-2’కు సీక్వెల్‌ కాదిది. అవే క్యారెక్టరైజేషన్స్‌తో కొత్తగా ఈ సినిమా చేస్తున్నాం. డబ్బు కారణంగా వచ్చే ఫ్రస్ట్రేషన్‌ నేపథ్యంలో కథాగమనం సాగుతుంది.  

VIDEOS

MOST READ
logo