బుధవారం 23 జూన్ 2021
Sports - Mar 10, 2021 , 00:48:49

ఐపీఎల్‌ ఆతిథ్యంపై హెచ్‌సీఏ చీఫ్‌ అజర్‌

ఐపీఎల్‌ ఆతిథ్యంపై హెచ్‌సీఏ చీఫ్‌ అజర్‌

  • హైదరాబాద్‌ లేకపోవడం దురదృష్టం  
  • మంత్రి కేటీఆర్‌ చొరవ అభినందనీయం 

హైదరాబాద్‌, ఆట ప్రతినిధి: స్థానిక ఉప్పల్‌ రాజీవ్‌గాంధీ స్టేడియంలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు లేకపోవడం దురదృష్టమని హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు మహమ్మద్‌ అజారుద్దీన్‌ అన్నాడు. ఐపీఎల్‌కు ఆతిథ్యమిచ్చేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించినా.. బీసీసీఐ ఆరు వేదికలకే పరిమితమైందని పేర్కొన్నాడు. వేదికల ఎంపిక బీసీసీఐ, ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ తీసుకున్న నిర్ణయమని అన్నాడు. హైదరాబాద్‌లో ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరిగేందుకు హెచ్‌సీఏ తరఫున అన్ని రకాలుగా ప్రయత్నించామని అజర్‌ చెప్పుకొచ్చాడు. మంగళవారం జింఖానాలో జరిగిన మీడియా సమావేశంలో ఐపీఎల్‌ ఆతిథ్యంతో పాటు గత పాలకవర్గ సభ్యుల వ్యవహార శైలిపై అజర్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. ‘హైదరాబాద్‌కు ఐపీఎల్‌ మ్యాచ్‌లు తీసుకొచ్చే విషయంలో సాధ్యమైనంత ప్రయత్నించాం. స్వయంగా నేను అహ్మదాబాద్‌ వెళ్లి.. బీసీసీఐ కార్యదర్శి జైషాతో మాట్లాడాను. ఏదైనా నేను అభ్యర్థించడం వరకే ఆ తర్వాత ఏ నిర్ణయమన్నది బీసీసీఐ చేతుల్లో ఉంటుంది. అంతకుమించి నేనేమి చేయలేను. కానీ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ చూపించిన చొరవ అభినందనీయం. ఐపీఎల్‌ మ్యాచ్‌ల నిర్వహణకు హైదరాబాద్‌ అత్యంత అనుకూలమైందంటూ బీసీసీఐని ఆయన కోరారు. హైదరాబాద్‌కు ఎందుకు అవకాశమివ్వలేదు అనే దానిపై బోర్డు ఎలాంటి కారణాలు చూపలేదు. ఏదైనా చేస్తామన్న తరహాలో వారు స్పందించారు. రాబోయే సీజన్‌లో ఏ జట్టు కూడా తమ సొంత మైదానంలో ఆడటం లేదు. కరోనా వైరస్‌ కేసులు పెరుగడమో లేక.. కొన్ని వేదికల్లో ఏమైనా సమస్యలుంటే అప్పుడేమన్న మనకు అవకాశం రావచ్చు’ అని అజర్‌ అన్నాడు. 

గత పాలకుల వల్లే

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రస్తుత స్థితికి గత పాలకుల నిర్ణయాలే కారణమని అజారుద్దీన్‌ తీవ్రంగా విమర్శించాడు. ముఖ్యంగా మాజీ అధ్యక్షుడు శివలాల్‌ యాదవ్‌పై అజర్‌ విరుచుకుపడ్డాడు. ‘హెచ్‌సీఏకు శివలాల్‌ ఏం చేశాడు? ఎంత మంది ఆటగాళ్లకు శిక్షణనిచ్చాడు? గతంలో బోర్డు నుంచి 200 కోట్లు వస్తే వాటిని ఏం చేశారు? ఉప్పల్‌ స్టేడియం తప్ప ఎక్కడైనా కొత్తవి నిర్మించారా? గత 24 ఏండ్లలో జిల్లాల్లో క్రికెట్‌ అభివృద్ధికి మీరు ఏం చేశారు? ఆ నిధులన్నీ ఎక్కడికి పోయాయి? మాపై విమర్శలు చేస్తున్న వాళ్లపై ఇప్పటికీ కేసులు నడుస్తూనే ఉన్నాయి. డబ్బులు ఇవ్వకుండా సీనియర్‌ ప్లేయర్లు ఎవరూ ముందుకొచ్చే పరిస్థితి లేదు. ఐదు లక్షలు ఇస్తామంటే అప్పుడు మేము సిద్ధమంటూ వస్తారు. ఈ కారణం వల్లే బయటి రాష్ర్టాల నుంచి  సెలెక్టర్లను తీసుకురావాల్సి వస్తున్నది’ అని అన్నాడు. ఇదిలా ఉంటే  ఈనెల 28న వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎమ్‌) ఉంటుందని అజారుద్దీన్‌ పేర్కొన్నాడు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న అంబుడ్స్‌మన్‌ నియామకం, సీఈవో, క్రికెట్‌ సలహాదారుల కమిటీ(సీఏసీ)తో పాటు పలు కీలక పదవులను భర్తీ చేస్తామని మీడియాకు తెలిపాడు. 

VIDEOS

MOST READ
logo