బుధవారం 23 జూన్ 2021
Telangana - Mar 10, 2021 , 02:47:17

కోడ్‌ ముగిశాక కొలువుల భర్తీ

కోడ్‌ ముగిశాక కొలువుల భర్తీ

  • ఉద్యోగార్థులకు మంత్రి కేటీఆర్‌ హామీ
  • రాష్ర్టానికి కేంద్రం చేసిందేమిటి?
  • విభజనచట్టంలో హామీ ఇచ్చిన 
  • విద్యాసంస్థలనూ ఇవ్వలేదు
  • అయినా రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి
  • ప్రైవేట్‌ కాలేజీలు, పాఠశాలల యాజమాన్యాలు, సిబ్బంది సంక్షేమ సంఘం ప్రతినిధుల భేటీలో కేటీఆర్‌

తెలంగాణకు ఏవీ ఇవ్వకుండా  నిరుద్యోగులను, విద్యావంతులను ఏ ముఖం పెట్టుకొని బీజేపీ ఓట్లు అడుగుతది?  ఏమన్నా అంటే ఇండియా -పాకిస్థాన్‌.. దేశం కోసం ధర్మం కోసం.. అంటూ పక్కదోవ పట్టిస్తారు. చేసింది చెప్పమంటే ఒక్కముచ్చట చెప్పరు. ఏమీ ఇవ్వని బీజేపీకి ఓటెందుకు వేయాలని పట్టభద్రులు ప్రశ్నించాలి. అందరి సంక్షేమానికి కృషిచేస్తున్న టీఆర్‌ఎస్‌కు మద్దతివ్వాలి. 

-మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ సిటీబ్యూరో, మార్చి 9 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత 50 వేల ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్‌ వస్తుందని రాష్ట్ర మంత్రి కే తారకరామారావు ప్రకటించారు. ఉద్యోగాల భర్తీపై విపక్షాలు పదేపదే అసత్యాలు ప్రచారం చేస్తుండటంపై ఆయన మండిపడ్డారు. అడ్డగోలుగా మాట్లాడుతున్న వారి నోళ్లకు తాళం వేయాలని పట్టభద్రులకు పిలుపునిచ్చారు. తెలంగాణ ఏర్పడ్డాక 1.32 లక్షల ఉద్యోగాలను భర్తీచేసి లెక్కలు చెప్పడంతో విపక్షాల నేతలు కొత్తరాగం అందుకుని.. ఖాళీలు ఉన్నాయని మాట్లాడుతున్నారని ఎద్దేవాచేశారు. మంగళవారం ఎస్వీటీ ఆడిటోరియంలో జరిగిన ప్రైవేట్‌ కాలేజీలు, పాఠశాలల యాజమాన్యాలు, సిబ్బంది సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ కొత్తగా ఏర్పడ్డ తెలంగాణకు కేంద్రం చేసింది ఏమీలేదని.. విభజన చట్టంలోని హామీలను కూడా నెరవేర్చలేదని విమర్శించారు. దేశవ్యాప్తంగా అనేక విద్యాసంస్థలను కేటాయించిన కేంద్రం.. తెలంగాణకు ఒక్కటికూడా ఎందుకు 

ఇవ్వలేదని నిలదీశారు. తెలంగాణ దేశంలో లేదా? భారత్‌ లో అంతర్భాగం కాదా? అని ప్రశ్నించారు. కేంద్రంనుంచి తోడ్పాటు లేకపోయినా.. తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదని తెలిపారు. తెలంగాణకు ముందు ఏర్పడిన మూడు రాష్ర్టాలు ఇవాళ్టికీ స్థిరత్వాన్ని పొందలేదని, తెలంగాణ ఏర్పడిన ఆరేండ్లలోనే సీఎం కేసీఆర్‌ పలు మౌలిక అంశాలను పరిష్కరించారని చెప్పారు. 

కేంద్రం ఏమిచేసింది? 


ఆరున్నరేండ్లలో తెలంగాణకు ఏం చేశారో బీజేపీ సన్నాసులు చెప్పాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు. దేశంలో కొత్తగా 5 ఐఐఎంలు, 2 ఐస్సార్‌, 16 ట్రిపుల్‌ ఐటీలు,  నాలుగు ఎన్‌ఐడీ (నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్స్‌),  84 నవోదయలు, 157 మెడికల్‌ కాలేజీలు, ఏర్పాటు చేస్తే వాటిల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా తెలంగాణకు కేంద్రం ఇవ్వలేదన్నారు. ‘పైపెచ్చు హైదరాబాద్‌లోని ఎన్‌ఐడీని నెల్లూరుకు ఎత్తుకుపోయారు? తెలంగాణలో దేశంలో లేదా?  విభజన చట్టంలో హామీ ఇచ్చిన  కోచ్‌ఫ్యాక్టరీ అవసరం లేదంటారు? తెలంగాణకు ఏవీ ఇవ్వకుండా  నిరుద్యోగులను, విద్యావంతులను ఏ మొహం పెట్టుకొని బీజేపీ ఓట్లు అడుగుతది?  తెలంగాణలో ఓట్లు అడిగే హ క్కుందా? అర్హత ఉందా?’ అని ప్రశ్నించారు. ఏమన్నా అంటే ఇండియా-పాకిస్థాన్‌.. దేశం కోసం ధర్మం కోసం.. అంటూ పక్కదోవ పట్టిస్తారు తప్ప.. చేసింది చెప్పమంటే ఒక్కముచ్చట చెప్పరని కేటీఆర్‌ అన్నారు. ఏమి చేయని..ఏమీ ఇవ్వని బీజేపీకి ఓటెందుకు వేయాలని పట్టభద్రులు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. సంక్షేమంకోసం కృషి చేస్తున్న టీఆర్‌ఎస్‌కు మద్దతుగా నిలబడాలని, ఎమ్మెల్సీ అభ్యర్థి ఎస్‌ వాణీదేవిని గెలిపించాలని పట్టభద్రులను, ప్రైవేట్‌ ఉపాధ్యాయులను కోరారు. 

వాణీదేవి విద్యావేత్త: కేకే

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవి గొప్ప విద్యావేత్తని, మంచి ఆర్టిస్టని రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు కొనియాడారు. విద్యారంగ సమస్యలపై మంచి అవగాహన ఉన్నవారని వివరించారు. గ్రాడ్యుయేట్ల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటే కీలకమని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుహక్కున్న పట్టభద్రులందరూ భాగస్వాములు కావాలని, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వాణీదేవిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో తలసాని సాయికిరణ్‌, ప్రైవేట్‌ కాలేజేస్‌ అండ్‌ స్కూల్‌ మేనేజ్‌మెంట్‌, స్టాఫ్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు పీఎల్‌ శ్రీనివాస్‌, ప్రేమ్‌ నారాయణ, శ్రీనివాస్‌, సుశీల్‌కుమార్‌, రూప తదితరులు పాల్గొన్నారు.

విద్యారంగంలో అసాధారణ ప్రగతి

విద్యారంగంలో అసాధారణ ప్రగతి సాధించామని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. ప్రతి మండలానికి ఒక గురుకుల పాఠశాలను ఏర్పాటుచేశామని, లక్షల మంది విద్యార్థులకు పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నామని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద 12,800 కోట్లు ఖర్చుచేశామని, ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ కింద రూ.20 లక్షలు అందిస్తున్నామని వివరించారు. ఈ స్కీంలో దాదాపు 3850 మంది విద్యార్థులకు లబ్ధిచేకూరిందన్నారు. కరోనా నేపథ్యంలో పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పాఠశాలలను బంద్‌ చేయించాల్సి వచ్చిందని.. దీనివల్ల యాజమాన్యాలు, ప్రైవేట్‌ టీచర్లు పడుతున్న ఇబ్బందులు తనకు తెలుసని చెప్పారు. కరోనావల్ల రాష్ర్టానికి రూ.52 వేల కోట్ల నష్టం వాటిల్లిందని, అందువల్లే 12 లక్షల మంది ప్రైవేట్‌ టీచర్లకు సాయం అందించడం సాధ్యంకాలేదన్నారు. దేశంలోని అన్ని రాష్ర్టాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నదని.. ఆ విషయాలను పక్కనపెట్టి.. టీఆర్‌ఎస్‌ సర్కారును మాత్రమే నిదించడం తగదని విపక్షాలకు హితవుపలికారు. ఈ విషయాన్ని పట్టభద్రులు దృష్టిలో ఉంచుకోవాలని కోరారు.

VIDEOS

MOST READ
logo