బుధవారం 23 జూన్ 2021
Telangana - Mar 10, 2021 , 02:41:49

కేటాయింపులు 28 కోట్లు.. ఇచ్చింది 2 కోట్లే!

కేటాయింపులు 28 కోట్లు.. ఇచ్చింది 2 కోట్లే!

  • ఆహార భద్రత నిధుల విడుదలపై కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్‌
  • లోక్‌సభలో లిఖితపూర్వక జవాబు 

హైదరాబాద్‌, మార్చి 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం చూపుతున్న వివక్షకు హద్దే లేకుండా పోతున్నది. రాష్ట్రం పట్ల కేంద్రం సవతితల్లి ప్రేమను చూపుతున్నదనేందుకు తాజా నిదర్శనం జాతీయ ఆహార భద్రత పథకంలో నిధుల కేటాయింపు, విడుదల. జాతీయ ఆహార భద్రత పథకం కింద 2020-21 సంవత్సరానికి గాను తెలంగాణకు కేంద్రం రూ. 28.04 కోట్లు కేటాయించింది. ఈ నెలతో ఆర్థిక సంవత్సరం ముగియనుండగా, ఇప్పటివరకు ఇచ్చింది కేవలం రూ. 2 కోట్లు మాత్రమే. సాక్షాత్తూ కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ లోక్‌సభ సాక్షిగా ఈ వాస్తవాలను అంగీకరించారు. ఈ పథకం కింద అతి తక్కువ నిధులు పొందిన రాష్ట్రం తెలంగాణ ఒక్కటే కావడం గమనార్హం. 2016-17 నుంచి 2020-21 వరకు ప్రతి సంవత్సరం కేంద్రం తెలంగాణకు అన్యాయమే చేస్తున్న విషయాన్ని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇతర రాష్ర్టాలకు కేటాయింపులు, నిధుల విడుదల దాదాపు సమానంగా ఉండగా, తెలంగాణకు కేటాయింపులే అంతంత మాత్రంగా ఉంటే.. ఇక నిధుల విడుదల అత్యంత అధ్వానంగా మారిపోయింది. 

ఈ యేడాది ఇచ్చింది 7.13 శాతమే...

జాతీయ ఆహార భద్రత పథకం కింద ఏ రాష్ర్టానికి ఎన్ని నిధులు కేటాయించారు? ఇంత వరకు ఎన్ని నిధులు ఇచ్చారని లోక్‌సభలో ఓ సభ్యురాలు అడిగిన ప్రశ్నకు వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ మంగళవారం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. జాతీయ ఆహార భద్రత పథకం కింద 2020-21 సంవత్సరానికి గాను తెలంగాణకు కేంద్రం రూ. 28.04 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. ఈ నెలతో ఆర్థిక సంవత్సరం ముగియనుండగా, ఇప్పటివరకు ఇచ్చింది కేవలం రూ. 2 కోట్లు మాత్రమేనని పేర్కొన్నారు. అంటే.. కేటాయించిన నిధుల్లో 7.13% మాత్రమే విడుదలయ్యాయి. మరోవైపు పక్కనున్న ఏపీకి కేటాయించిన నిధులలో 80.83% నిధులు విడుదల కాగా గుజరాత్‌కు 68.66%, మహారాష్ట్రకు 83.82%, ఉత్తరప్రదేశ్‌కు 54.27% నిధులు విడుదలయ్యాయి. ఏ రాష్ర్టాన్ని పరిశీలించినా తెలంగాణ కన్నా ఎక్కువ నిధులు పొందడం గమనార్హం. ఇప్పటికే పలు అంశాల్లో తెలంగాణపై వివక్ష చూపిస్తున్న కేంద్రం ఇప్పుడు జాతీయ ఆహార భద్రత పథకంలోనూ అదే ధోరణిని ప్రదర్శించిందని పలువురు విమర్శిస్తున్నారు.


VIDEOS

MOST READ
logo