బుధవారం 23 జూన్ 2021
Telangana - Mar 10, 2021 , 02:47:17

పది పైసలకే కిలోమీటర్‌ ప్రయాణం

పది పైసలకే కిలోమీటర్‌ ప్రయాణం

 • రూ.32-47 వేల వరకు బ్యాటరీ ధర
 • ఖరారు కావాల్సిన విధి విధానాలు

కొండాపూర్‌, మార్చి 9: పెట్రోల్‌తో నడిచే ఏ మోటర్‌సైకిల్‌ అయినా సరే ఎలక్ట్రిక్‌ వెహికిల్‌గా మార్చేస్తామంటున్నది ఈశ్వర్‌ వాహన్‌ సంస్థ. రోజురోజుకు పెరుగుతున్న పెట్రోలు ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. మరోవైపు నానాటికీ పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని అదుపుచేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయి. నగరవాసులు సైతం ఆరోగ్యపరంగా, ఆర్థికపరంగా ఎలక్ట్రిక్‌ వాహనాలే భేష్‌ అంటున్నారు. కొన్ని పెద్ద కంపెనీలు ఇప్పటికే ఎలక్ట్రిక్‌ బైక్‌లను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టాయి. అయితే అవి పెట్రోలు బైక్‌లకంటే రెట్టింపు ధర పలుకుతున్నాయి. ఈనేపథ్యంలో పెట్రోలుతో నడిచే వాహనాన్ని అతి తక్కువ ఖర్చుతో ఎలక్ట్రిక్‌ బైక్‌గా మార్చవచ్చని ఆటోమొబైల్‌ రిసెర్చ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఏఆర్‌ఏఐ) చెప్తున్నది. 

తయారీ విధానం..

ద్విచక్ర వాహనాలను రెండు విధాలుగా ఎలక్ట్రిక్‌గా మారుస్తున్నారు. మొదటిది హైబ్రిడ్‌ కన్వర్షన్‌ (పెట్రోల్‌+ఎలక్ట్రిక్‌), రెండోది పూర్తి విద్యుత్‌ వాహనం (ఇంజిన్‌ను తొలగించి ఎలక్ట్రిక్‌గా మార్చడం). ఈ వాహనాల్లో వినియోగించే బ్యాటరీలకు రూ.32 వేల నుంచి రూ.47 వేల వరకు ఖర్చవుతున్నది. బ్యాటరీ నాణ్యతను బట్టి ప్రయాణ దూరం ఆధారపడి ఉంటుంది. బైక్‌ వెనుక చక్రంలో కరెంట్‌తో నడిచే మోటర్‌ హబ్‌ అమరుస్తారు. పెట్రోల్‌ ట్యాంక్‌ స్థానంలో బ్యాటరీని ఏర్పాటుచేస్తారు. హైబ్రిడ్‌ కన్వర్షన్‌ వాహనాలకైతే, దాని పరిమాణాన్ని బట్టి పెట్రోల్‌ ట్యాంక్‌ను మరోచోట ఏర్పాటుచేస్తారు. ఈ మొత్తం మార్పులను ఒక్కరోజులో పూర్తిచేస్తారు. ఎలక్ట్రికల్‌ వాహనంగా మారిన వాటికి బిజిలీబైక్‌డాట్‌కామ్‌ ద్వారా సర్టిఫికెట్లను అందిస్తారు. ఈ సర్టిఫికెట్‌ ఆధారంగా ఆర్టీవో కార్యాలయానికి వెళ్లి బైక్‌ ఆర్సీని మార్చుకోవచ్చు.

ఎక్కడైనా చార్జింగ్‌ చేసుకోవచ్చు

ఎలక్ట్రిక్‌ బైక్‌ బ్యాటరీని కరెంట్‌ సాకెట్‌ ఉన్న ప్రతిచోట చార్జింగ్‌ పెట్టుకోవచ్చు. ఎలక్ట్రిక్‌ వాహనం వేగాన్ని గరిష్ఠంగా గంటకు 60 కిలోమీటర్ల వద్ద లాక్‌ చేస్తారు. దీంతో రాష్‌ డ్రైవింగ్‌కు అవకాశం ఉండదు. దీంతో ప్రమాదాలు తగ్గడమే కాకుండా.. మైలేజీ కూడా పెరుగుతుంది. 

ఎలక్ట్రిక్‌గా మార్పుతో లాభాలు:

 • నిర్ణీత దూరాలు ప్రయాణించే వారికి ఖర్చు అదా
 • సర్వీసింగ్‌ అక్కర్లేదు, జీరో కాలుష్యం
 • పెట్రోల్‌తో పోల్చితే 30 రెట్లు తక్కువ ఖర్చు (10 -15 పైసలకే కిలోమీటరు ప్రయాణం)
 • వన్‌టైం ఇన్వెస్ట్‌మెంట్‌
 • ఏదైనా ద్విచక్ర వాహనాన్ని ఎలక్ట్రికల్‌గా మార్చుకోవచ్చు
 • ఎల్‌ఈడీ లైటింగ్‌ 
 • స్పీడ్‌ తగ్గుతుంది, రాష్‌ డ్రైవింగ్‌లకు అవకాశం ఉండదు
 • టైర్లు, బ్రేక్‌లు మాత్రమే మార్చుకోవాల్సి వస్తుంది.

తక్కువ ఖర్చుతో సర్టిఫైడ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌గా మారుస్తున్నాము

బిజిలీబైక్‌డాట్‌కామ్‌ సహకారంతో ఈశ్వర్‌ వాహన్‌ పేరిట ఏదైనా బైక్‌ను ఎలక్ట్రిక్‌ వెహికల్‌గా మారుస్తున్నాం. బ్యాటరీల రకాలను బట్టి ఖర్చు రూ. 32వేల నుంచి రూ.47వేల వరకు ఉంటుంది. ఎలక్ట్రిక్‌ వెహికల్‌కు టైర్లు, బ్రేక్‌లు మార్చుకోవడం తప్ప మారే ఖర్చు ఉండదు. తిరిగి పెట్రోల్‌ వాహనంగా మార్చుకొనే సదుపాయం కూడా ఉన్నది. ఎలక్ట్రిక్‌ బైక్‌కు 200ల కేజీల బరువును లాగే సామర్థ్యం ఉంటుంది. బైక్‌లతో పాటు ఆటోలు, టాటా ఏస్‌ వంటి రవాణా వాహనాలను సైతం ఎలక్ట్రిక్‌గా మారుస్తాము.

- కృష్ణప్రసాద్‌, ఈశ్వర్‌ వాహన్‌

విధి విధానాలు లేవు: ఆర్టీఏ 

హైదరాబాద్‌ సిటీబ్యూరో, మార్చి 9 (నమ స్తే తెలంగాణ): పెట్రోలు, డీజిల్‌ వాహనాలను ఎలక్ట్రిక్‌ వాహనాలుగా మార్చే సంస్థలు ఆటోమొబైల్‌ రిసెర్చ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఏఆర్‌ఏఐ) నుంచి అనుమతి తీసుకోవాలని ఆర్టీఏ అధికారులు స్పష్టం చేశారు. ఆ సంస్థలు ఏఆర్‌ఏఐ అనుమతి ఆధారంగా సంబంధిత ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌కు దరఖాస్తు చేసుకోవా లి. కమిషనర్‌ దానిని పరిశీలించి వివరాలు సరైనవైతే ఆర్టీఓ కార్యాలయాలకు ఆ సంస్థ గురించి సమాచారం అందిస్తారు. అనంతరం ఆ సంస్థ సాధారణ వాహనాలను ఈవీలుగా మార్చే ప్రక్రియను చేపట్టవచ్చని రవాణా శాఖ అధికారులు పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు దీనిపై ఎలాంటి విధివిధానాలు రూపొందించలేదని తెలిపారు. ఇంతవరకు రవాణా శాఖ నుంచి అనుమతి తీసుకున్న తయారీ సంస్థలు ఏవీ లేవని అధికార వర్గాలు స్పష్టం చేశాయి.


VIDEOS

MOST READ
logo